చరిత్రాత్మక 500వ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించి అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. కీవిస్‌పై 197 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన విక్టరీ సాధించింది. 434 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని కివీస్ టీమ్.. చివరిరోజు 236 పరుగులకే ఆలౌటైంది. రోంచి, సాంట్నర్ పోరాడినా.. న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.
4 వికెట్లకు 93 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ కాసేపు భారత బౌలర్ల జోరును అడ్డుకుంది. సాంట్నర్ (71), రోంచి (80) ఐదో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ కీలక భాగస్వామ్యాన్ని జడేజా బ్రేక్ చేయడంతో మళ్లీ కివీస్ వికెట్ల పతనం మొదలైంది. రోంచిని జడేజా ఔట్ చేసిన తర్వాత.. వాట్లింగ్, క్రెయిగ్ లను వెంట వెంటనే పెవిలియన్ పంపించాడు షమి. ఈ క్రమంలో హ్యాట్రిక్ సాధించే అవకాశం షమికి దక్కినా.. దానిని అందుకోలేకపోయాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌లో పది వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీయడం అతనికిది ఐదోసారి. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియాకు 1-0 ఆధిక్యం లభించింది. మ్యాచ్ లో మొత్తం 92 పరుగులు చేసి, ఆరు వికెట్లు తీసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టెస్ట్ ఈ నెల 30 నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.
Congratulations #TeamIndia on winning the Kanpur Test #500thTest @Paytm Test Cricket #INDvNZ pic.twitter.com/WUfXropxK7
— BCCI (@BCCI) September 26, 2016