ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఏకంగా పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైనే అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. తొలగింపునకు గురైన ఢిల్లీ మంత్రి కపిల్‌మిశ్రా కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్ నుంచి కేజ్రీవాల్ రూ.రెండు కోట్ల మొత్తాన్ని తీసుకోవటం తాను చూశానని చెప్పారు. దీనిపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ.. పనితీరు సరిగా లేక మంత్రి పదవిని కోల్పోయిన కపిల్‌మిశ్రా.. అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు.
ఢిల్లీ ప్రభుత్వంలో తాగునీటి సరఫరా మంత్రిగా ఉన్న కపిల్మిశ్రాను సీఎం కేజ్రీవాల్ శనివారం తొలగించారు. పార్టీ అధినాయకత్వంపై కుమార్‌విశ్వాస్ ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించినప్పుడు ఆయన పక్షం వహించిన కపిల్మిశ్రాను ఉన్నపళంగా మంత్రి పదవిని తొలగించటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అయితే, పదవి కోల్పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే పార్టీపై, సీఎంపై కపిల్‌మిశ్రా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధిని ఆదివారం సందర్శించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంత్రిగా ఉన్న రెండేండ్ల సమయంలో తాను చూసిన అనేక అక్రమాలకు సంబంధించిన వివరాలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు అందజేశానని చెప్పారు. శుక్రవారం కేజ్రీవాల్‌కు ఆయన నివాసంలో ఆరోగ్య, ప్రజాపనుల శాఖ మంత్రి సత్యేంద్రజైన్ రూ.2 కోట్లను నగదురూపంలో ఇవ్వటం నేను నా కళ్లతో చూశాను.
దీనిగురించి కేజ్రీవాల్‌ను అడిగినప్పుడు.. రాజకీయాల్లో ఇటువంటివి మామూలేనని, వివరాలు తర్వాత తెలుస్తాయని చెప్పారు. ఇదొక్కటే కాదు. కేజ్రీవాల్ బంధువుకు చెందిన రూ.50 కోట్ల విలువైన భూ వివాదాన్ని తాను పరిష్కరించానని జైన్ ఓసారి నాతో వ్యక్తిగతంగా చెప్పారు. అవినీతిపై చర్యలు చేపట్టాలంటూ కొంతకాలంగా పార్టీ నేతలపై నేను ఒత్తిడి చేస్తూ వచ్చాను. దీనివల్లే పదవి నుంచి నన్ను తొలగించారు. విరాళాలు, పంజాబ్ ఎన్నికలు, ఢిల్లీ ప్రభుత్వం తదితర అంశాలకు సంబంధించిన రకరకాల అవినీతి కార్యకలాపాలతోపాటు మనీల్యాండరింగ్, నల్లధనం, ఒక మంత్రి కుమార్తె నియామకం, ఖరీదైన బస్సుల కుంభకోణం, సీఎన్జీ ఫిట్నెస్ పరీక్ష కుంభకోణం వంటివాటి గురించి చాలాకాలంగా వినిపిస్తున్నది. కొన్నింటిని నేను నా కళ్లతో స్వయంగా చూశాను. కానీ, కేజ్రీవాల్‌ను విశ్వసించాను. ఎవరూ ఆయనను అవినీతిపరుడిగా మార్చలేరని, అవినీతిపై ఆయన చర్యలు తీసుకుంటారని నమ్మాను అని కపిల్‌మిశ్రా చెప్పారు.