బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశ్యం కాంగ్రెస్‌కు లేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వెంట నిలబడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమిష్టిగా పోరాడి గొప్ప విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరగా, కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేవలం మున్సిపల్ ఎన్నికలే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేశామని గుర్తుచేసిన కేటీఆర్, కాంగ్రెస్ తెచ్చిన అప్పులతో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read:Omega-3:ఓమేగా-3 లోపమా?

