రివ్యూ: అర్జున్ రెడ్డి

374
Arjun Reddy movie review
Arjun Reddy movie review
- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్ మరే సినిమాకు రాలేదు. దీనిపై భారీ అంచనాలు ఏర్పడటానికి కారణం టీజర్, ట్రైలర్. వాటి ద్వారా మా సినిమాలో స్టార్లు లేక పోయినా మంచి కంటెంటు ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించారు. మరీ ఆ కంటెంట్ ఉందా లేదా తెలియాలంటే రివ్యూ చదవండి..

కథ:
డాక్టర్ అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్. టాప్ ఆఫ్ ది క్లాస్, టాపర్ ఆఫ్ ది యూనివర్శిటీ. అయితే యాంగర్ మేనేజ్మెంటులో జీరో. కోపం వస్తే ఆదుపుచేసుకోలేడు. ఓ చిన్న గొడవలో క్షమాపణ చెప్పడం ఇష్టం లేని అర్జున్ రెడ్డి కాలేజీ వదిలి వెళ్లివెళ్లేందుకు సైతం సిద్ధమవుతాడు. అదే సమయంలో ఫస్టియర్లో కొత్తగా జాయినైన ప్రీతి(శాలిని)ని చూసి మనసు పారేసుకుంటారు. కాలేజీ వదిలి వెళ్లాలనే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. అలా ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరైన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంతలో ప్రీతికి మరొకరితో పెళ్లై పోతుంది. దాంతో మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ రెడ్డిని ఇంట్లోంచి బయటికొచ్చేసి, అన్ని చెడు అలవాట్లకు బానిసై అమితంగా ప్రేమించే డాక్టర్ వృత్తిని కూడా వదిలేస్తాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అర్జున్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉండేది ? చివరికి అతని స్వచ్ఛమైన ప్రేమ గెలిచిందా లేదా ? అనేదే ఈ సినిమా.

ప్లస్‌ పాయింట్స్‌:
3 గంటల సినిమా అయినా మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు స్క్రీన్ ప్లే రన్ చేసిన తీరు బావుంది. స్వచ్ఛమైన ప్రేమ, అది విఫలమైనప్పుడు కలిగే భాధను గాఢమైన రీతిలో చెప్పడంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సక్సెస్ అయ్యాడు. అర్జున్‌ రెడ్డి-ప్రీతిల మధ్య ప్రేమను వెండితెరపై చూపించిన విధానం బాగుంది. యువతకు ఈ సినిమా ఎప్పుడూ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని కుర్రాడిగా, ప్రేమలో విఫలమై మానసిక వ్యధను అనుభవించే ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. హీరో పాత్రలోని ప్రతి అంశాన్ని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. హీరోయిన్ షాలిని కూడా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. క్యూట్ లుక్ తో, విజయ్ దేవరకొండకు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది.

arjun redddy

సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో అర్జున్‌ రెడ్డి కాలేజీ.. ప్రేమ.. కోపం.. మూడు అంశాలతో సినిమా ఆకట్టుకునేవిదంగా ఉంది. ఇంటర్వెల్ తరువాత హీరోయిన్‌కు మరోకరితో పెళ్లి జరిగిపోవడం.. ప్రీతి జ్ఞాపకాల నుండి బయట పడలేక తాగుడుకు, డ్రగ్స్‌కు బానిసైపోతాడు, చివరకు పిచ్చోడిలా రోడ్డున పడేస్థాయి వస్తాడు…. ఆ తర్వాత కథ థియేటర్లో చూస్తేనే బావుంటుంది. ఇక హీరో స్నేహితుడి పాత్ర శివ ఆద్యతం హీరోకి సపోర్ట్ చేస్తూనే మంచి ఫన్ ను అందించింది. అందులో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ యాసలో మంచి టైమింగ్ తో డైలాగ్స్ చెబుతూ అలరించగా ఇతర నటులు కళ్యాణ్, కమల్ కామరాజ్ లు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

మైనస్‌ పాయింట్స్‌:
సినిమా సెకండాఫ్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ రెడ్డి ప్రీతిని మర్చిపోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు మరీ ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడటం, హీరో బాధల్లో ఉంది నాశనమైపోతున్నా కూడా దగ్గరవాలనుకోకపోవడం వంటి అంశాల వెనుక అంత బలమైన కారణాలేవీ కనబడలేదు. సినిమా మొత్తం ప్రేమలో విఫలమైనవాడు ఎలా కుంగిపోతాడు అనే అంశాన్ని బలంగా చూపించిన దర్శకుఢు హ్యాపీ ఎండింగ్ ఇద్దామనే ఉద్దేశ్యంతో సినిమాను ఉన్నట్టుండి ప్రేక్షకుడి మూడ్ ను తలకిందులు చేసే విధంగా ముగించడం కొంచెం డిస్టర్బ్ చేసింది. సినిమా క్లైమాక్స్ ,హీరోయిన్ పాత్రలో ఖచ్చితత్వం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పాటించి ఉండాల్సింది.

Vijay Devarakonda Arjun Reddy Dubbing Started

సాంకేతిక విభాగం :
కథ, కథనాలు చాలా వరకు ఆకట్టుకోగా బలమైన హీరో పాత్ర, సన్నివేశాలు బాగున్నాయి. దర్శకుడు, రచయిత సందీప్ రెడ్డి వంగ విఫల ప్రేమికుడి జీవితం ఎలా ఉంటుందో చూపించడానికి హడావుడి లేకుండా సన్నివేశాల్లోని భావోద్వేగంతో కనెక్టయ్యేందుకు ప్రేక్షకుడికి సమయం ఇవ్వడం అనే పద్దతి మెప్పించింది. సంగీత దర్శకుడు రాధన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం బాగున్నాయి. రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.సెట్టింగ్ అనేదే లేకుండా ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించడంతో సినిమాకు సహజత్వం కలిగింది. శశాంక్ తన ఎడిటింగ్ ఫర్లేదు.

తీర్పు:
అర్జున్ రెడ్డి’ పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు, డైలాగులు ఫ్యామిలీస్‌తో కలిసి చూడలేం. ఏ సినిమా అయినా క్లైమాక్స్ అదిరిపోతేనే ప్రేక్షకుడు ఆనందంగా, మంచి సినిమా చూసిన ఫీలింగుతో బయటకు వస్తాడు. అర్జున్ రెడ్డి మూవీ క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు సంతృప్తి చెందేలా ఉంది. మొత్తం మీద భిన్నమైన సినిమాల్ని, బలంగా కదిలించే కథల్ని ఇష్టపడేవారికి ‘అర్జున్ రెడ్డి’ నచ్చుతుంది.

విడుదల తేదీ:25/08/2017
రేటింగ్ : 3.25|5
న‌టీన‌టులు:విజయ్ దేవరకొండ, షాలిని పాండే
సంగీతం: రాధన్
నిర్మాత‌: ప్రణయ్ రెడ్డి వంగ
ద‌ర్శ‌క‌త్వం: సందీప్ రెడ్డి వంగ

- Advertisement -