కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు తరచూ సూచిస్తుంటారు. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సి, డి, ఇ, కె, బి-కాంప్లెక్స్ వంటి పోషకాలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు కూడా కూరగాయల్లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా కూరగాయల్లో కేలరీలు, కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం.
అయితే కొందరు కూరగాయలను పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. పచ్చిగా తింటే ఎక్కువ పోషకాలు అందుతాయని భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి కూరగాయను పచ్చిగా తినడం సురక్షితం కాదు. పంటల పెంపకంలో ఉపయోగించే రసాయన ఎరువులు, పురుగుమందుల అవశేషాలు కూరగాయలపై మిగిలి ఉండే అవకాశం ఉంది. వాటిని శుభ్రంగా కడగకుండా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
కొన్ని కూరగాయలు జీర్ణం కావడానికి కష్టంగా ఉండి గ్యాస్, అజీర్తి, విరోచనాలు వంటి సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా చిలగడదుంప, బీన్స్, రెడ్ కిడ్నీ బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, బ్రోకలి, పొట్టగొడుగులు వంటి వాటిని పచ్చిగా తినకూడదు. కాబట్టి కూరగాయలను బాగా కడిగి, అవసరమైతే ఉడికించి లేదా ఆవిరి పట్టించి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

