AP:ONGC గ్యాస్ బావిలో బ్లోఅవుట్

5
- Advertisement -

కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ (ONGC) గ్యాస్ బావిలో ఏర్పడిన బ్లోఅవుట్‌ తీవ్ర ఆందోళనకు కారణమైంది. బావిలో నుంచి భారీగా గ్యాస్ వెలువడుతూ మంటలు ఎగసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ పూర్తిగా తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆ బావిలో సుమారు 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు.

మధ్యాహ్నం లోపు మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోతే బావిని మూసివేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మంటలను ఆర్పేందుకు గూడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అగ్నిమాపక వాహనాలు, సాంకేతిక పరికరాలతో ఓఎన్జీసీ సిబ్బంది మంటలను నియంత్రించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొద్దిగా మంటల తీవ్రత తగ్గినప్పటికీ ప్రమాద స్థితి ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితిని ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల భద్రతే ముఖ్యమని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్‌

- Advertisement -