ఏపీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది. అనంతరం పురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీకి చుక్కెదురైంది. ఇక్కడి మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను వైసీపీ 28 చేజిక్కించుకోగా, టీడీపీకి 6 వార్డులే దక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో ఎంఐఎం, బీజేపీ కూడా చెరో వార్డు గెలుచుకోవడం విశేషం అని చెప్పాలి. కాగా, 8 వార్డులో రీకౌంటింగ్ జరుగుతోంది.
ఇక చిత్తూరు జిల్లాలోనూ వైసీపీదే హవా అని కనిపిస్తోంది. చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లను వైసీపీ వశమయ్యాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 49 డివిజన్లలో వైసీపీ 48 కైవసం చేసుకోగా, టీడీపీకి ఓ డివిజన్ దక్కింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 46 గెలుచుకోగా, టీడీపీకి 3 స్థానాలు సాధించింది. పుత్తూరు మున్సిపాలిటీ వైసీపీ పరమైంది. ఇక్కడ వైసీపీ 20 వార్డుల్లో విజేతగా నిలవగా, టీడీపీ 6 స్థానాలు దక్కించుకుంది.
అయితే కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో హోరాహోరీ నెలకొంది. ఇక్కడ మొత్తం 24 వార్డులుండగా… టీడీపీదే పైచేయి అయింది. టీడీపీకి 12, వైసీపీకి 11, జనసేనకు ఒక వార్డు దక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. తాడిపత్రిలో ఏకగ్రీవాలు అన్నీ కలుపుకుని వైసీపీ 10 చోట్ల విజయం సాధించగా, టీడీపీ 11 స్థానాల్లో నెగ్గింది. సీపీఐ 1, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక స్థానం దక్కాయి. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉండగా, ఇంకా 13 వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తాడిపత్రిలో 24వ వార్డు అభ్యర్థిగా బరిలో దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.