ఏపీ మంత్రుల..ప్రొఫైల్‌

493
ap ministers profile
- Advertisement -

ఏపీ మంత్రివర్గవిస్తరణలో తనదైన మార్క్‌ చూపించారు సీఎం జగన్‌. పాత,కొత్త కలయికతో 25 మందితో పూర్తిస్ధాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇక దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లో ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించారు.

ఇక ఏపీ మంత్రుల ప్రొఫైల్ పరిశీలిస్తే…

బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి)

మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కించుకున్న వారిలో సీనియర్‌ బొత్స సత్యనారాయణ. 1958  ,జులై 9న జన్మించిన బొత్స డిగ్రీ వరకు చదివారు. 1992లో విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996, 1998ల్లో బొబ్బిలి ఎంపీగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1999లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2004,2009లో చీపుపురల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన బొత్స..2019లో చీపురుపల్లి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

పేర్ని వెంకట్రామయ్య (నాని)

మచిలిపట్నం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నాని 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014 ఓటమిపాలైన నాని 2019 ఎన్నికల్లో కొల్లు రవీంద్రపై విజయం సాధించారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

సీఎం జగన్‌కు బంధువైన బాలినేని ఐదుసార్లు ఎమ్మెల్యే విజయం సాధించారు. 1999, 2004, 2009ల్లో వరుసగా కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆదిమూలపు సురేష్‌‌( యర్రగొండపాలెం)

1985-90 మధ్య ఏపీ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖలో ఏఈఈ బాధ్యతలు నిర్వర్తించిన సురేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్‌ పిలుపుతో 2009లో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీసీ తరఫున సంతనూతలపాడు నుంచి ,2019 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి గెలుపొందారు.

కొడాలి వెంకటేశ్వరరావు(కొడాలి నాని-గుడివాడ)

టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొడాలి నాని కృష్ణా జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపుపొందారు. పలు సినిమాలను నిర్మించారు. 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి..2013లో వైసీపీలో చేరారు. 2014, 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు.

మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మేకతోటి సుచరిత డిగ్రీ వరకు చదువుకున్నారు. 2006లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉపఎన్నికలో వైసీపీ తరుపున ప్రత్తిపాడు నుంచి గెలిచారు.తాజా ఎన్నికల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ పై విజయం సాధించి జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)

కాంట్రాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1978లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. పీలేరు నుంచి జనతా పార్టీ తరపున తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 1985,1994లో ఓటమిపాలయ్యారు. 1999, 2004లో పీలేరు ,2009లో పుంగనూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014, 2019ల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. 2009 నుంచి 2010 వరకు అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి)

అవంతి విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు పొందిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌ 2009లో పీఆర్పీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలో స్ధానం సంపాదించారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ)

ఎమ్మెల్యేగా ఓడినా తన కేబినెట్‌లో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు చోటు కల్పించారు సీఎం జగన్‌. 1978లో రాజకీయ ప్రవేశం సుభాష్ చంద్రబోస్ 1989లో రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన 2004లో స్వతంత్ర అభ్యర్థిగా,2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన సుభాష్‌ 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

అనిల్ కుమార్ యాదవ్ ( నెల్లూరు )

సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు అనిల్ కుమార్ యాదవ్‌. నెల్లూరు కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అనిల్ బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2012లో వైసీపీలో చేరిన ఆయన 2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మోపిదేవి వెంకటరమణ

ఉభయసభల్లోనూ సభ్యుడు కాకుండానే మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు మోపిదేవి వెంకటరమణ. 1987లో నిజాంపట్నం మండలాధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1989, 1994ల్లో కూచినపూడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999, 2004 లో కూచినపూడి నుంచి ,2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలుపొందారు. వైఎస్‌,కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట)

ఏపీ సీఎం జగన్‌కు నమ్మినబంటుల్లో ఒకరు ధర్మాన కృష్ణదాస్‌. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు సోదరుడైన కృష్ణదాస్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2004, 2009లో కాంగ్రెస్ నుంచి 2019లో వైసీపీ నుంచి నరసన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పాముల పుష్ప శ్రీవాణి( కురుపాం)

బీఎస్సీ,బీఈడీ చదివిన పాముల పుష్ప శ్రీవాణి 2014లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2014లో మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమారుడు పరిక్షిత్ రాజును వివాహం చేసుకున్నారు. కురుపాం నుంచి 2014,2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పినిపే విశ్వరూప్‌( అమలాపురం)

కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విశ్వరూప్ ముమ్మిడివరం నుంచి 1998 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో ముమ్మిడివరం నుంచి,2009లో అమలాపురం నుంచి విజయం సాధించారు. గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్‌)

జర్నలిస్టుగా ఉన్న కురసాల కన్నబాబు..2009లో చిరంజీవి స్ధాపించిన పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. తాజాగా 2019 ఎన్నికల కంటే ముందు వైసీపీలో చేరిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తానేటి వనిత(కొవ్వూరు)

ఎమ్మెస్సీ చదివిన తానేటి వనిత రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గోపాలపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో ఓటమి పాలయ్యారు. తాజాగా 2019లో వైసీపీ నుంచి కొవ్వూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట)

1995 నుంచి ప.గో జిల్లా రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీరంగనాథరాజు 2004లో అత్తిలి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.2018లో వైసీపీలో చేరి ఆచంట నియోజకవర్గ కన్వీనరుగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2019లో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని)

వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో స్వతంత్ర, 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009ల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2017 నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ఆళ్ల..2019లో వైసీపీ తరఫున ఏలూరు నుంచి పోటీ చేసి విజయబావుటా ఎగురవేశారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ (పశ్చిమ)

పీఆర్పీ నుంచి రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించిన వెల్లంపల్లి 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. తాజాగా 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

- Advertisement -