పోలీసుల తీరుతో బీపీ పెరుగుతోంది!

21
- Advertisement -

ఏపీ పోలీసుల తీరుపై రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా క్యాజువ‌ల్‌గా కేసులు పెట్టి, వాంగ్మూలాలు సృష్టిస్తున్న పోలీసుల వ్య‌వ‌హార శైలి చూస్తుంటే త‌మ‌కు బ్ల‌డ్ ప్రెజ‌ర్ (బీపీ) పెరిగిపోతోందని ఏపీ హైకోర్టు ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదో ఒక కేసులో ఎవరో ఒకరిని అరెస్టు చేయాలన్న‌ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు మండిప‌డింది. కేసుల విష‌యంలో పోలీసులు కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారని, ప్ర‌భుత్వ‌ పెద్దల మెప్పు కోసం పని చేయొద్దని, ప‌రిధి దాటి ప‌నిచేస్తే.. భ‌విష్య‌త్తులో ఏదైనా సమస్య వస్తే ఎవ‌రూ మిమ్మ‌ల్ని కాపాడ‌ర‌ని సున్నితంగా హెచ్చ‌రించింది.

మాదిగ మ‌హాసేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప్రేమ‌కుమార్ అరెస్టుపై ఆయ‌న కుమారుడు హైకోర్టు దాఖ‌లు చేసిన హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం.. రాష్ట్రంలో ఇష్టానుసారంగా న‌మోద‌వుతున్న కేసుపై సీరియ‌స్ అయ్యింది. పోలీసుల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. పెద్ద‌ల మెప్పుకోసం కాకుండా.. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పనిచేయాల‌ని సూచించింది.

ప్రేమ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? అని ప్ర‌శ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. ప్రేమ్‌కుమార్ అరెస్టు రికార్డుల‌ను త‌మ‌కు అందించాల‌ని క‌ర్నూలు పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది.

Also Read:తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

- Advertisement -