ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్

8
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు, గోప్యతను కించపరిచేలా సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు, ప్రచారాన్ని నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పోస్టులు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని పిటిషన్‌లో పవన్ పేర్కొన్నారు.

పవన్ తరఫున ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ హాజరై వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ న్యూస్, మార్ఫ్డ్ వీడియోలు, తప్పుడు ప్రచారం పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, పిటిషనర్ తరఫు న్యాయవాది సాయి దీపక్‌కు వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఉదాహరణలు, లింకులు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణలో ఈ వివరాల ఆధారంగా అవసరమైన దిశానిర్దేశాలు జారీ చేయనున్నట్లు కోర్టు తెలిపింది.

సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న ఆధారంలేని ఆరోపణలు, దుష్ప్రచారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వేసిన ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు ఫలితం, భవిష్యత్తులో సెలబ్రిటీలకు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన సోషల్ మీడియా నియంత్రణల్లో కీలక ప్రమాణంగా మారే అవకాశం ఉన్నట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -