తుఫాన్ హెచ్చరిక..కంట్రోల్ రూమ్ ఏర్పాటు

6
- Advertisement -

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీఎంసీ కార్యాలయంలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 0863-2345103 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. నగరంలోని డొంక రోడ్డు, మూడు వంతెనలు, చుట్టుగుంట, కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉండటంతో, నీటిని వెంటనే తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

బలమైన గాలుల కారణంగా హోర్డింగులు, చెట్లు కూలి రహదారులపై పడితే వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్, ఏడీహెచ్ విభాగాల అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తుగా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

డీవైఈఈ, ఈఈ, టీపీ, ఏసీపీ, డీసీపీ, శానిటరీ సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, రహదారులపై పడే చెట్లు, ఇతర అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

Also Read:FMCG:సామాన్యులకు మరో షాక్‌..

తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాగునీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -