మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అన్నది ప్రతిక్షణం గుర్తుంచుకోవాలన్నారు ఏపీ సీఎం జగన్. అమరావతిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని, నవరత్నాల అమలే ప్రధాన ధ్యేయం కావాలని ఆయన అన్నారు. చరిత్రలో ఎన్నడూలేనంత విజయాన్ని ప్రజలు మనకు అందించారని.. ప్రభుత్వంలో అధికారులు కూడా భాగస్వాములేనని ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిదని, ఇందులోని ప్రతి హామీని నెరవేర్చి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. అందుకు అధికారుల సహకారం పూర్తిగా ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. పేదల జీవితాలు మార్చెందుకే నవరత్నాల పథకం తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ, కలెక్టర్లు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పారు. ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటరీని తప్పనిసరిగా నియమిస్తున్నామని.. అలాగే.. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తామన్నారు.