కేసీఆర్‌ది మంచిమనసు: ఏపీ సీఎం జగన్‌

520
ap cm jagan
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ది మంచి మనసు అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. రాష్ట్రానికి మంచి జరగాలనే ఆరాటంతోనే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి జలాల వినియోగంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్‌ ..టీడీపీ చేసిన విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ,ఏపీ మధ్య నీటి వినియోగంపై స్పష్టత ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై టీడీపీ పదే,పదే రాద్దాం చేస్తుందని ఆ ప్రాజెక్ట్ కడుతుంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఎగువ రాష్ట్రం,ఏపీ దిగువ రాష్ట్రం ..వారు నీళ్లు వదిలితేనే మనకు వస్తయాన్న విషయాన్ని గుర్తు చేశారు. సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లు రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తి.. నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు వస్తే తెలంగాణలో 4 , ఏపీలో 9 జిల్లాలు బాగుపడతాయన్నారు.

కేసీఆర్ పెద్ద మనసు, మంచి వారని కొనియాడిన జగన్‌…చంద్రబాబు రాక్షసుడని మండిపడ్డారు.  టీడీపీ ఏపీకి పట్టిన శని అని దుయ్యబట్టారు.ఏపీ,తెలంగాణ సీఎంలు ఇద్దరం ప్రజలకు మంచి చేయాలని నిర్ణయాలు తీసకుంటున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని భావిస్తున్నామని…తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ మనకు సహకారం అందిస్తుంటే హర్షించాల్సిందిపోయి.. దాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్.

- Advertisement -