రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా రూపొందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులతో పాటు సంబంధిత హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (హెచ్ఓడీలు), సెక్రటరీలు హాజరయ్యారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ పురోగతి, రిజిస్ట్రేషన్ సేవల అమలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై చర్చ జరిగింది. భూ లావాదేవీల్లో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే అభివృద్ధి పనుల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలన్న దిశగా మార్గదర్శకాలు జారీ చేశారు.
సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌పై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. ఆయా శాఖలకు అవసరమైన నిధులు, ప్రాధాన్య కార్యక్రమాలకు కేటాయింపులపై సమీక్షించారు. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఎంతవరకు వినియోగించబడ్డాయో, లక్ష్యాల సాధనలో ఎలాంటి లోపాలు ఉన్నాయో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా పనులు సాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

