గత కొన్నాళ్లుగా పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన కూటమితో కలవడం లేదా కలవకపోవడం పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలు బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందనేది ఎవరికి అర్థంకానీ అంశంగా మారింది. బీజేపీని కలుపుకోవడం కోసం పవన్, చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి బీజేపీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పకుండా సస్పెన్స్ లోనే ఉంచుతోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో టీడీపీ జనసేన కూటమి అధినేతలు పలు మార్లు భేటీ అయ్యారు కూడా. .
ఇక తాజాగా మరోసారి పవన్, చంద్రబాబు డిల్లీ బయలుదేరారు. చివరిసారిగా పొత్తు విషయంలో అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు బీజేపీ సింగిల్ గా బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఏపీలో సింగిల్ గా పోటీ చేసే సామర్థ్యం కాషాయ పార్టీకి లేనందున మళ్ళీ పొత్తు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల విషయంలో ఈసారి కమలనాథుల చేస్తున్న డిమాండ్ టీడీపీ, జనసేన పార్టీలను ఇరకాటంలో పెట్టెలా కనిపిస్తోంది. కూటమితో కలవాలంటే 12 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్ సభ సీట్లు కావాలని కాషాయ పార్టీ డిమాండ్ చేస్తునట్లు వినికిడి.
పైగా మూడు పార్టీల తరుపున సిఎం అభ్యర్థిగా బీజేపీ నేత నే ఉండాలనేది కమలనాథుల కోరిక. అయితే ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన టీడీపీ జనసేన పార్టీలు, అందులో బీజేపీని ప్రస్తావించలేదు. కానీ రెండో జాబితాలో బీజేపీని కలుపుకొని సీట్ల ప్రకటన చేయాలని చంద్రబాబు పవన్ భావిస్తున్నారట. తొలి జాబితాలో టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ సీట్లను ప్రకటించాయి. ఇక రెండో జాబితాలో బీజేపీ డిమాండ్ చేస్తున్న 12 స్థానాలను కేటాయిస్తే టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ చేస్తున్న డిమాండ్ కు పవన్, చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికి బీజేపీతో పొత్తు వ్యవహారం ఈ ఢిల్లీ టూర్ తో తేలిపోనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి