గతంలో పలుసార్లు అనేక అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోమారు ప్రతిష్టాత్మక పురస్కారాలను తన రికార్డు ఖాతాలో జమచేసుకుంది. ఇంధన పొదుపులో బంగారు, వెండి పతకాలను సాధించి సంస్థ తన పేరు ప్రఖ్యాతుల్ని మరింత ఇనుమడింపజేసుకుంది. బ్యూరో ఆఫ్ ఎఫిషియేన్సీ విద్యుత్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్థి సంస్థ (టి.ఎస్.రెడ్‌కో) ఆధ్వర్యంలో ఖైరాతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరాజన్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సంబంధిత ఉన్నతాధికారులు పురస్కారాలను అందుకున్నారు. ఆయా రంగంలో ఇంధన వినియోగాన్ని తగ్గించిన సంస్థలకు ఇంధన వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇంధన పరిరక్షణ పురస్కారాలను ప్రతి ఏటా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంధన పొదుపు, ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీలో టి.ఎస్.ఆర్టీసీ బంగారు, వెండి పతకాలు దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) శ్రీ సి.వినోద్ కుమార్, సి.ఎం.ఇ శ్రీ టి.రఘునాథరావు, నల్గొండ రీజినల్ మేనేజర్ శ్రీ సి.హెచ్.వెంకన్నలతో పాటు నల్గొండ, కల్వకుర్తి డిపో మేనేజర్లు శ్రీ సురేశ్, శ్రీ సుధాకర్‌లు పై అవార్డులను గవర్నర్ నుంచి స్వీకరించారు.
సమష్టి కృషితోనే సంస్థకు ఖ్యాతి అన్నారు ఆర్టీసీ ఎం.డి శ్రీ సునీల్ శర్మ. సంస్థ తరఫున పురస్కారాలు స్వీకరించిన సందర్భంలో సంబంధిత అధికారులు, ఉద్యోగులు ఎం.డి శ్రీ సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెరుగైన ఇంధన పొదుపు సాధించడం ద్వారా సంస్థకు ఖర్చు తగ్గిందని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉత్ఫాదకత, రోడ్డు భద్రత, ఇంధన సంరక్షణ వంటి విభాగాలలో పలుమార్లు అనేక అవార్డులు సాధించిన ఘనత సంస్థకు ఉందని, ఈ క్రమంలో మరోసారి అవార్డులను టి.ఎస్.ఆర్.టి.సి కైవసం చేసుకోవడం ఆనందదాయకమన్నారు. ఇంధన పొదుపు లక్ష్య సాధనలో అందరి కృషి ఫలితమే ఈ విజయమని చెబుతూ అవార్డు సాధించిన నల్గొండ, కల్వకుర్తి డిపో అధికారులకు, ఉద్యోగులందరికీ ఎం.డి శుభాభినందనలు తెలియజేశారు.
ఇంధన పొదుపులో టి.ఎస్.ఆర్టీసీ టాప్ గా నిలిచింది. 2018-19 సంవత్సరానికి గానూ నల్గొండ డిపో 106 బస్సులతో 171.51లక్షల కిలోమీటర్లు ఆపరేట్ చేసిన బస్సుల ద్వారా 1.65లక్షల లీటర్ల ఇంధనం ఆదా చేయడం ద్వారా రూ.109.96 లక్షల ఖర్చు తగ్గింది. ఇందుకు గానూ ఇంధన పొదుపులో నల్గొండ డిపో టాప్‌గా నిలిచి బంగారు పతకం దక్కించుకుంది.
అలాగే, కల్వకుర్తి డిపోలో 77 బస్సులతో 98.71లక్షల కిలోమీటర్లు ఆపరేట్ చేసిన బస్సుల ద్వారా 1.37లక్షల లీటర్ల ఇంధనం ఆదాతో రూ.91.45 లక్షల ఖర్చు తగ్గింది. ఈ మేరకు ఇంధన పొదుపులో టాప్-2 గా నిలిచి వెండి పతకం కైవసం చేసుకుంది. ఈ కేటగిరీలో సంబంధిత అధికారులతో పాటు ఆ డిపోల ఎం.ఎఫ్, కె.ఎం.పి.ఎల్ మెకానిక్, ఎస్.డి.ఐ, డ్రైవర్‌లు కూడా అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్ర, ట్రాన్స్‌కో సి.ఎం.డి శ్రీ డి.ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.