బాలీవుడ్ దర్శకుడు సంజయ్ భన్సాలీ రూపొందించిన పద్మావతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాజ్ పుత్‌ల ఆందోళనల నేపథ్యంలో ఆ చిత్ర విడుదలను నిర్మాతలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తీసిన సినిమా వివాదాల్లో మునిగిపోయి ఎప్పుడు రిలీజవుతుందో తెలియక తీసినవాళ్లు తలపట్టుకు కూర్చుంటే మీరు తీసిన దానికంటే డిఫరెంట్ గా సినిమా తీస్తాం అని ఇప్పుడు ఇంకొందరు రెడీ అయిపోయారు. ఇదంతా ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పద్మావతి సినిమా గురించే.
రాజస్థాన్ లోని రాజపుత్రులు తమ గౌరవంగా భావించే రాణి పద్మావతి జీవిత గాథతో బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమా తెరకెక్కించాడు. ఇందులో టైటిల్ రోల్ దీపికా పదుకునే చేసింది. ఆమె భర్త గా షాహిద్ కపూర్.. ఆమెను మోహించిన అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ నటించారు. సంజయ్ లీలా భన్సాలీ తీసిన సినిమాలో అన్నీ అవాస్తవాలే తీశారని.. దానికి బదులుగా రాణి పద్మావతి అసలైన చరిత్రతో తాము సినిమా తీస్తామని అశోక్ శేఖర్ అనే నిర్మాత అంటున్నారు. ఈ సినిమాకి ‘మై హూ పద్మావతి’ అనే టైటిల్ కూడా పెట్టేశారు. కొత్త యాక్టర్లతో ఈ సినిమా తీయబోతున్నారు. రాజస్థాన్ కే చెందిన రైటర్ ఈ కొత్త పద్మావతి సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. హిందీతోపాటు రాజస్థానీ భాషలోనూ ఈ సినిమా తీస్తామని నిర్మాణ అశోక్ శేఖర్ అంటున్నారు.
పద్మావతి జీవిత గాథకు సంబంధించి ఇంకో వెర్షన్ గా ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోవడం వరకు బాగానే ఉంది. అసలు సంజయ్ లీలా భన్సాలీ ఏం తీశాడో వెండితెరపై చూడకుండానే అంతకన్నా డిఫరెంట్ గా తీస్తామని చెప్పడం కాస్తంత వెరయిటీగానే ఉంది. మరోపక్క సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘పద్మావతి’ చిత్రంపై మొదలైన నిరసనల వేడి ఇంకా తగ్గలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.