బిట్ కాయిన్‌ కరెన్సీ యోచనలో మోడీ..!

278
Another experiment with currency?
Another experiment with currency?
- Advertisement -

కరెన్సీల్లో ఖరీదైనదేంటి? రోజూ చూస్తుంటాం కనక ఠక్కున డాలరు గుర్తొస్తుంది. కానీ దాని విలువ మనకు కేవలం 68 రూపాయలు. అదే కువైట్‌ దినార్‌ అయితే..? దాదాపు 223 రూపాయలు. ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన కరెన్సీ ఇదే అంటారంతా!!. మరి బిట్‌కాయిన్‌ సంగతో..? ఒక బిట్‌కాయిన్‌ దాదాపు రూ.55,700. అంటే… తులం బంగారంకన్నా కూడా ఎక్కువ. దాదాపు రూ.49,000 పలుకుతున్న కిలో వెండికన్నా కూడా ఎక్కువ. ఇప్పుడు ఇదే విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రహస్య కరెన్సీగా గుర్తింపు పొందిన బిట్ కాయిన్ తరహాలో ‘లక్ష్మి’ పేరిట సొంత క్రిప్టో కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని పరిశీలిస్తోంది.

ఇప్పటికే అధికారులు ఈ విషయమై చర్చించారని, ఆర్థిక వ్యవహారాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చే దిశగా సొంత బిట్ కాయిన్స్ ఉంటే మేలని అధికారులు అభిప్రాయపడ్డట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఈ కరెన్సీని సులువుగానే నిర్వహించవచ్చని, అయితే, కరెన్సీ చట్టాల్లో సవరణలతోనే ఇది సాధ్యమని వారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ప్రతిపాదనల రూపంలో ఉన్న స్వీయ రహస్య కరెన్సీ చెలామణిలోకి రావాలంటే మరింత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఎస్తోనియా, రష్యా, చైనా తదితర దేశాల్లో క్రిప్టో కరెన్సీ విధానం అమల్లో ఉంది. ప్రభుత్వం నుంచి సూచన ప్రాయంగా ఈ ప్రతిపాదన తమకు వచ్చిందని ఆర్బీఐ ఈడీ సుదర్శన్ సేన్ వెల్లడించారు. తమకు మాత్రం ఈ ఆలోచన ఏమంత నచ్చలేదని తెలిపారు.

భారత్‌లో బిట్‌కాయిన్‌కు అధికారికంగా ఎలాంటి గుర్తింపులేకపోయినా ఇప్పటికే మన దేశంలో ఆరు లక్షల మంది పెట్టుబడుల కోసం ఈ డిజిటల్‌ కాయిన్స్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు అంచనా. దీంతో ఈ ఏడాది మేలో 1,735 డాలర్లు ఉన్న ఒక బిట్‌కాయిన్‌ విలువ ప్రస్తుతం 3,733 డాలర్లకు చేరింది. రోజుకు 2,500 మంది ఈ జాబితాలో చేరుతున్నారు. ప్రస్తుతం ఈ లావాదేవీల కోసం మన దేశంలో ఏకంగా ఒక బిట్‌కాయిన్స్‌ ఎక్స్చేంజే నడుస్తోందంటే దీనికి పాపులారిటీ ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు..

- Advertisement -