తెలుగు అమ్మాయిగా అందరి అభిమానాన్ని చూరగొన్న నటి అంజలి. పుట్టింది తెలుగు గడ్డపైనే అయిన తమిళ జనాలకి చాలా దగ్గరైంది. తెలుగు అమ్మాయి అయినా తమిళంలో ముందుగా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.ఈ రోజుల్లో ఐదారేళ్లు ఇండస్ట్రీలో నెట్టుకు రావడమే కష్టంగా ఉంటే, అంజలి ఏకంగా పదేళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ భామ ప్రస్తుతం హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న బెలూన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మారోసారి మంచి హిట్ అందుకుంటా అంటూ తెగ కామెంట్ చేస్తున్న ఈ భామ ఇంతకు ముందు గీతాంజలి, చిత్రాంగద వంటి హర్రర్ సినిమాల్లో నటించింది.
తాజాగా బెలూన్ ప్రమోషన్ లో పాల్గొన్న ఈ భామ స్పందిస్తూ .. పదేళ్ల కెరీర్‌ను చిత్ర పరిశ్రమలో విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. మరో పదేళ్లు కూడా కథానాయికగా నటించి, మరింత గుర్తింపు తెచ్చుకుంటా. కథ పూర్తిగా విన్న తర్వాతే అందులో నటించడానికి ఒప్పుకుంటా. అందుకే నేను నటించిన చాలా సినిమాలు నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక దెయ్యం చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. అందుకోసమే ‘బలూన్’ లో నటించడానికి అంగీకరించా. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన అంశాలన్నీ దాగున్నాయి. ఇందులో జై రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు.” అంటూ చెప్పుకొచ్చింది.