TTD:శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

32
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు.

Also Read:ఆ సమస్య ఉంటే..అల్లం తినొద్దు

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.సోమవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖర్ బాబు, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Also Read:జాన్వీ కపూర్ పాత్రలో అల్లు అర్హ

- Advertisement -