పండగవేళ..మందుబాబులకు షాక్‌!

5
- Advertisement -

మందు బాబులకు ఏపీ సర్కార్ షాకిచ్చింది. సంక్రాంతి పండగ వేళ లిక్కర్ బాటిళ్లపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కే. మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎంఆర్‌పీ రూ.99గా ఉన్న మద్యం బాటిళ్లు, బీర్లు, వైన్ బాటిళ్లకు ఈ ధర పెంపు వర్తించదని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు బార్లు, మద్యం దుకాణాల్లో వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొనేది. దీనిని సరిచేసేందుకు అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఇకపై బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది.

ఈ ధరల పెంపు ఐఎంఎఫ్‌ఎల్‌తో పాటు ఫారిన్ లిక్కర్‌కూ వర్తించనుంది. అదే సమయంలో వైన్స్ షాపుల లైసెన్సీలకు ఇచ్చే లాభాన్ని మరో ఒక శాతం పెంచుతూ ప్రభుత్వం ఊరటనిచ్చింది. మద్యం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరడంతో, వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు మైక్రో బ్రూవరీ పాలసీలోనూ మార్పులు చేసింది ఎక్సైజ్ శాఖ. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల ఐదు కిలోమీటర్ల పరిధిలో త్రీస్టార్ లేదా అంతకంటే పెద్ద హోటళ్లలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మార్పులు రాష్ట్ర ఆదాయం పెంచడమే లక్ష్యంగా చేపట్టినవిగా ప్రభుత్వం చెబుతోంది.

Also read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

- Advertisement -