యాంకర్ సుమ… ఈ పేరు తెలియని వారుండరు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఆవిడ ఫ్యాన్సే. ఏ ఇంట్లో అయినా ఆవిడ ప్రస్తావనే.. తెలుగు మాతృభాష కాకపోయినా 56 అక్షరాల తెలుగు పిల్ల ఆవిడ. హ్యూమర్ ఆవిడ స్పెషాలిటి.. గ్లామర్ ఆవిడ క్వాలిటీ.. ఆవిడ ఓ స్టార్ మహిళ .. వాఖ్యానాన్ని ఆవిడ సున్నితమైన హాస్యంతో సరదా సరదాగా మార్చేసిన యాంకర్ ఆవిడ. ఆమె ఏ షో చేసినా ప్రేక్షకులు అవాక్కవ్వాల్సిందే.. పక్కనున్నది స్టార్ అయినా సూపర్ స్టార్ అయినా అదే తీరు.. అదే జోరు.. అందుకే ఏ సినిమా ఫంక్షనైనా ఆవిడే యాంకర్.
1991లో టీవీ పరిశ్రమలో అడుగుబెట్టిన ఈ స్టార్ యాంకర్ తన ఈ 26 ఏళ్ల ప్రస్థానంలో 26 ఇంగ్లీష్ అక్షరాలకు అందనంత ఎత్తుకు ఎదిగారు. టీవీ నటిగా ప్రయాణం మొదలు పెట్టి.. రాజీవ్ చేయిపట్టి.. మెట్టినింటా అడుగుపెట్టి.. పట్టుబట్టి వ్యాఖ్యానం లక్ష్యం వైపు గురిపెట్టి తెలుగువారికి అయింది బంగారు పెట్టి ఈ గారాల పట్టి. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. అది సాంప్రదాయ బద్దమైన కార్యక్రమం అయినా, విజ్ఞాన చర్చ వేదిక అయినా, సరదాగా సాగే సినిమా షో అయినా క్యాజువల్ గా సాగే యూత్ ప్రోగ్రామైనా యాక్షన్, ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ యాంకర్ సుమ ఆస్తులు.
ఇంతై.. ఇంతింతై.. వటుడింతై అన్న చందానా అందరితోనూ ఉంటూ ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగింది ఆవిడ. మాటల్లోనే కాదు.. మంచితనంలోనూ ఆవిడ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే అనాధ చిన్నారులు, వృద్ధాశ్రమాలకు తన వంతు సాయం చేస్తున్న సుమ… తాజాగా తన మాతృభూమి కేరళకు కూడా తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా సుమ తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి కేరళలో హాస్పిటల్ కట్టించడానికి ముందుకొచ్చారు.
కేరళలోని అలిప్పి జిల్లా కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థలోకి చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని వీరు నిర్మించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. అలిప్పి జిల్లాల్లోని కన్నీటి గాథలపై చలించిన సుమ కనకాల దంపతులు అక్కడి సబ్ కలెక్టర్ కృష్ణతేజను సంప్రదించారు. కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ వంతుగా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మిస్తామని ఈ సందర్భంగా వారు మాట ఇచ్చారు. హాస్పిటల్ పునర్నిర్మాణానికి తన వంతుగా ఉడుతా భక్తిగా సాయం చేస్తున్నామని, ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఎంత ఖర్చైనా తాము భరిస్తామని సుమ రాజీవ్ దంపతులు తెలిపారు.