పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీరు మరోసారి విమర్శలపాలైంది. పవన్ కల్యాణ్ హాజరుకాని ఏ మెగా హీరో ఫంక్షనైనా పవర్‌స్టార్ నినాదాలతో హోరెత్తిపోతుంది. ఇక మెగాఫ్యామిలీకి చెందిన ఏ హీరో పంక్షన్ జరిగినా అక్కడికి వెళ్లడం, పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారు పవన్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ పై మెగా బ్రదర్ నాగబాబు చాలాసార్లు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ తీరు మార్చుకోవాలని పవన్ ఫ్యాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా విజయవాడలో శనివారం వంగవీటి చిత్రం ఆడియో ఫంక్షన్ జరగ్గా అక్కడ కూడా కొందరు పవన్ ఫ్యాన్స్ అల్లరి చేశారు.
పవన్ ఫొటోలను ప్రదర్శిస్తూ రచ్చ చేశారు. ఒక దశలో సహకరించాలని పవన్ ఫ్యాన్స్‌ను యాంకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. ‘క్రమశిక్షణే ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇలా గోల చేస్తూ ఆ హీరోకి మచ్చలా తయారయ్యారు మీరంతా. కేవలం కొంతమంది వల్ల ఆయన అభిమానులందరికీ చెడ్డపేరు వస్తోంది. విజయవాడ వస్తే ఇలాగేనా గౌరవించేది. ఎంతో దూరం నుంచి ఈ వేడుకకు వచ్చిన అతిథులను ఇలాంటి నినాదాలతో ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాద’ని ఝూన్సీ వ్యాఖ్యానించింది. దీంతో యాంకర్ ఝాన్సీకి వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
గతంలో ప్రభాస్‌ను కూడా పవన్ ఫ్యాన్స్ ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బహిరంగంగానే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తీరు మార్చుకోవాలని పవన్ ఫ్యాన్స్‌కు క్లాస్ పీకాడు. ఆయన అభిమానులు తమ తీరు మార్చుకోలేదు.