బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అమితాబ్ తన మనవరాలు ఆరాధ్యను ఆప్యాయంగా హత్తుకుని కనిపించారు. ఈ ఫొటోతో పాటు ఐశ్వర్య.. ‘హ్యాపీ బర్త్‌డే డియరెస్ట్ పా-దాదాజీ.. ఎల్లప్పుడూ ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి’ అంటూ విషెస్ చెప్పారు. దీంతో అభిమానులు కామెంట్ల రూపంలో ప్రేమను కురిపిస్తున్నారు.
అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం ముంబైలోని తన నివాసం జల్సా బయటకు వచ్చిన ఆయన.. అభిమానులను కలుసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు తమ అభిమాన నటుడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అమితాబ్‌కు భారీ పూలమాల తీసుకొచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:రాహుల్‌తో భేటీకి సీజేఐ నో!
ఇక ఆరాధ్యతో కలిసి అమితాబ్ ఉన్న ఫొటోను ఐశ్వర్య షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనవరాలితో ఉన్న చిత్రాలను పంచుకున్నారు.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007 ఏప్రిల్ 20న వివాహం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ తమ ప్రేమకథ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2000లో ‘ఢాయీ అక్షర్ ప్రేమ్ కే’ సినిమా షూటింగ్ సమయంలో తమ పరిచయం మొదలైందని తెలిపారు. అప్పట్లో తమ బంధం ఇంత దూరం వస్తుందని ఊహించలేదన్నారు. తమ వివాహ బంధానికి 19 ఏళ్లు పూర్తయ్యాయని, 20వ వార్షికోత్సవం కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

