రివ్యూ : అమీతుమీ

355
Ami Tumi Review
- Advertisement -

అవసరాల శ్రీనివాస్, అడివిశేష్, ఈషా, అదితి ప్రధాన పాత్రల్లో ఎప్పుడు కొత్త రకమైన చిత్రాల్ని అందించే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం అమీతుమీ. అష్టాచమ్మ, జెంటిల్ మెన్ లాంటి హిట్ సినిమాల తరహాలో మోహనకృష్ణ..  ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా అంచనాల మేర రాణించిందా…?ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం…

Ami Tumi Review
కథ:

అమీ తుమీ రెండు జంటల ప్రేమకథ. దీపిక (ఈషా) – అనంత్ (అడ‌వి  శేష్‌)  ప్రేమికులు. కానీ దీపిక తండ్రి జ‌నార్ధ‌న్ (త‌నికెళ్ల భ‌ర‌ణి) మాత్రం త‌న కూతురికి వైజాగ్‌కి చెందిన డ‌బ్బున్న కుర్రాడు శ్రీ చిలిపి (వెన్నెల‌కిషోర్‌)కి ఇచ్చి పెళ్లి చేయాల‌ని చూస్తుంటాడు. జనార్ధన్ కొడుకు విజ‌య్ (అవ‌స‌రాల శ్రీనివాస్‌) కూడా మాయ (అదితి) అనే అమ్మాయిని  ప్రేమిస్తుంటాడు. కానీ మాయ తండ్రితో ఉన్న గొడ‌వ‌లతో వారి పెళ్లికి స‌సేమిరా అంటాడు. కూతుళ్ల పెళ్లిళ్లు త‌న‌కి ఇష్ట‌మైన వాళ్ల‌తోనే జ‌రిపించాల‌నే ప‌ట్టుద‌ల జ‌నార్ధ‌న్ ది. అయితే.. దీపిక ఇంట్లో నుంచి పారిపోయి అనంత్‌ని వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకొంటుంది. త‌న చెల్లెలులానే విజ‌య్ కూడా మాయని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాల‌నుకొంటాడు.  మాయ మాత్రం త‌న తండ్రి ఒప్పుకొంటేనే  పెళ్లి అని చెబుతుంది. మ‌రి వీరి మ‌ధ్య‌కు శ్రీచిలిపి వ‌చ్చాక ఏం జ‌రిగింది?  అనంత్‌, విజ‌య్‌, శ్రీచిలిపిల పెళ్ళిళ్ల విష‌యంలో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకొన్నాయి?  చివరికి కథ ఎలా సుఖాంతమయింది అనేది తెరమీద చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథనం,మాటలు,కామెడీ, నటీనటులు. ప్రధానపాత్రదారులైన అడవిశేష్, అవసరాల శ్రీనివాస్, ఈషా, అదితి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవసరాల,తనికెళ్ల భరణి తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు బాగున్నాయి. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు వెన్నెల కిషోర్. సీరియస్‌గా ఉంటూనే వెన్నెల చేసిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామాని దర్శకుడు న‌డిపిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తి స‌న్నివేశంలోనూ ద‌ర్శ‌కుడి ర‌చ‌నా బ‌లం క‌నిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో వేగం తగ్గడం, ఇంగ్లీషులో సాగే కొన్ని మాట‌లు మాత్రం స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు అంత సుల‌భంగా అర్థం కావు.

Ami Tumi Review
సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ద‌ర్శ‌కుడి ప‌నిత‌న‌మే సినిమాకు కీల‌కం. స్క్రిప్టు ద‌శ‌లోనే సినిమాని ప‌క్కాగా చూసుకొన్నారు. అందుకే స‌న్నివేశాలు అంత బాగా పండాయి మాట‌లు మెరుపులు చిత్రం నిండా క‌నిపిస్తాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమకథతో మరోసారి ఆకట్టుకున్నాడు.  మ‌ణిశ‌ర్మ సంగీతం, పి.జి.విందా సినిమాటోగ్రఫీ సినిమాకి బ‌లాన్నిచ్చాయి. మార్తాండ్ వెంకటేష్‌ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

రెండు జంట‌ల ప్రేమ‌.. పెళ్లిళ్ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. క‌థ‌గా వింటే అస‌లు ఇలాంటి ఓ చిన్న లైన్‌తో  సినిమా తీయ‌డం సాధ్య‌మేనా అనిపిస్తుంది. కానీ ద‌ర్శ‌కుడు ర‌చ‌న‌లో చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించి సినిమాని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దాడు. క‌థ‌నం, మాట‌లు సినిమా,నటీనటులు సినిమాకు ప్లస్ పాయింట్ కాగా అక్కడక్కడ అర్ధం కానీ ఇంగ్లీష్ డైలాగ్‌లు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా మోహనకృష్ణ ఇంద్రగంటి మార్క్  కుటుంబసమేతంగా చూడదగ్గ కామెడీ ఎంటర్ టైనర్ అమీతుమీ.

విడుదల తేదీ:09/06/2017
రేటింగ్:3.25/5
నటీనటులు : అడవిశేష్, అవసరాల శ్రీనివాస్,  వెన్నెల కిశోర్, ఈషా, అదితి మైకల్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : కె.సి. నరసింహారావు
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

- Advertisement -