బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్‌కు ఆత్మీయ సన్మానం

68
bc

ఒకనాటి సంక్షోభ హాస్టళ్లను నేడు సంక్షేమ హాస్టళ్లుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేనని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ అన్నారు. అంబర్ పేట బిసి హాస్టల్ పూర్వ విద్యార్ధులు, హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసి కమిషన్ సభ్యులుగా నూతనంగా నియమితులైన సందర్భంగా జరిగిన ‘ఆత్మీయ సన్మాన సభ’లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు పురుగుల అన్నం, కప్పులతో కొలిచిపెట్టే అన్నం, చాలీచాలని స్కాలర్షిప్ లు, సరైన వసతులులేక ఆకలికేకలతో అలమటించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మన విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించి, గొప్ప మనసుతో వారికి సన్న బియ్యంతో సంతృప్తికరమైన భోజనం పెడుతున్నాడన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి, కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులఁదరికీ నాణ్యమైన విద్యను అందజేస్తున్నారన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు.

మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను అంబర్ పేట బిసి హాస్టల్ లేకుంటే నాయకుడిని అయ్యేవాడిని కాదన్నారు. సమాజం కోసం పని చేసే అవకాశం ఇక్కడి నుంచే నాకు లభించిందని కిశోర్ గౌడ్ గర్వంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదల బతుకులు బాగుపడతాయని, ఇదంతా ఉద్యమ నాయకుడు కేసీఆర్ తోనే సాధ్యమని భావించి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం (TRSV) లో చేరి, స్వరాష్ట్రం కోసం ఉద్యమించడం జరిగిందన్నారు. బీసీ హాస్టల్ లో చదువడం, బీసీల సమస్యల పట్ల అవగాహన, సామాజిక, తెలంగాణ ఉద్యమ నేపథ్యాలను చూసిన సీఎం కేసీఆర్ ఒక సాధారణ వ్యక్తి అయిన నన్ను బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించారన్నారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తానని, బీసీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని కిశోర్ గౌడ్ స్పష్టం చేశారు.

అంబర్ పేట పూర్వ విద్యార్థుల నాయకుడు బడేసాబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రామ్ కోటి, బీసీ విద్యార్థి సంఘం నేతలు జూకంటి ప్రవీణ్,అనంతుల రామ్మూర్తి గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్, ఈడిగ శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, ప్రభాకర్, మహేష్, హరి కృష్ణ, చందు హైదరాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, నర్సింహులు, మురళి, హాస్టల్ వార్డెన్ స్వర్ణలత, అంబర్ పేట హాస్టల్ పూర్వ విద్యార్ధులు మాట్లాడుతూ.. అంబర్ పేట బిసి హాస్టల్ లో తమతో కలిసి చదివిన కిశోర్ గౌడ్ బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులవడం పట్ల ఆనందంగా ఉందని, సీఎం కేసీఆర్ కు ఈసందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాస్టల్ విద్యార్థులు పాల్గొని కిషోర్ గౌడ్ ను అభినందనలు తెలియజేసి, సన్మానించడం జరిగింది.సన్మాన కార్యక్రమం తర్వాత హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.