మాత మరణాలను తగ్గించండి: అమయ్ కుమార్

316
amay kumar
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో ప్రసూతి సమయంలో మాత మరణాలను కనిష్ట స్థాయిలో తేవాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో మాత మరణాలను తగ్గించేందుకై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నేడు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. స్వరాజ్య లక్ష్మి, డెప్యూటీ డీ.ఎం.హెచ్.ఓ లు,ఐ.సి.డీ.ఎస్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కన్నా రంగా రెడ్డి జిల్లా మెటర్నల్ డెత్ రేషియో అత్యంత తక్కువగా ఉందని దీనిని జీరో స్థాయికి తేవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం లక్షకు కేవలం 77 మాత్రమే మెటర్నల్ డెత్ లున్నాయని, ఇది జాతీయ, రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువ అని పేర్కొన్నారు.

అయినప్పటికీ ఈ సంఖ్యను అత్యంత కనిష్ట స్థాయికి తెచ్చేందుకై సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కృషి చేయాలని అమయ్ కుమార్ అన్నారు. ప్రధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితులు, పోషకాహారం, ఆరోగ్య సలహాలు, సూచనలను అందించడం పై ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యం గా ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మాత, నవజాత శిశువులు మరింత జాగ్రత వహించేలా తగు జాగ్రత్తలు చేపట్టేలా చూడాలని అన్నారు. జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులలో జరిగే మాతృ మరణాలపై వివరణ కోరుతూ వారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు. ప్రతి గర్భిణిని కనీసం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు విధిగా నాలుగు సార్లు పరీక్షించాలని ఆదేశించారు. హైరిస్క్ కేసులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -