హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు HCA అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్న రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జగన్మోహన్‌రావు అరెస్ట్ అనంతరం గత తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవికి తాజాగా తెరపడింది.
2023లో జరిగిన HCA ఎన్నికల్లో అమర్‌నాథ్ స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో జగన్మోహన్‌రావు చేతిలో అమర్‌నాథ్ కేవలం ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యారు. అయితే అనంతరం జగన్మోహన్‌రావు అరెస్ట్ కావడంతో HCA అధ్యక్ష పదవి ఖాళీగా మారింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ పరిపాలనలో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతూ వచ్చింది.
ఈ పరిస్థితుల్లో తనను HCA అధ్యక్షుడిగా నియమించాలని అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. అందుకు సంబంధించిన వాదనలు, రికార్డులను పరిశీలించిన అనంతరం అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ కైత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌కు అధ్యక్ష పదవి అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
అమర్‌నాథ్ నియామకంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నెలకొన్న పరిపాలనా సంక్షోభానికి ముగింపు పలికినట్లయింది. ఇకపై HCA కార్యకలాపాలు సక్రమంగా సాగనున్నాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’

