గ్రేటర్ హైదరాబాద్‌లో దోమల నివారణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఆల్ఫాసైఫర్ మిథేన్ రసాయనం కలిపిన నీటిని విస్తృతంగా స్ప్రేయింగ్ చేస్తున్నారు. పది లీటర్ల నీటిలో 250 గ్రాముల ఆల్ఫాసైఫర్ మిథేన్ రసాయనాన్ని కలిపి మలేరియా, డెంగ్యూ పాజిటీవ్‌గా ఉన్న ప్రాంతాలు, నగరంలోని అన్ని పాఠశాలల్లో జిహెచ్ఎంసి ఎంటమాలజి విభాగం విస్తృతంగా స్ప్రేయింగ్ చేపట్టింది.
ఈ స్ప్రేయింగ్‌తో నివాసాలు, పాఠశాలల భవనాల గోడలపై ప్రత్యేక పొర ఏర్పడి ఆ గోడలపై వాలిన దోమలు వెంటనే చనిపోతాయి. ఒక్కసారి ఈ మందును స్ప్రేయింగ్ చేస్తే 45రోజుల పాటు ప్రభావం ఉంటుంది. తద్వారా దోమల నియంత్రణ విజయవంతమవుతోందని జిహెచ్ఎంసి ఎంటమాలజి విభాగం ఉన్నతాధికారులు తెలియజేశారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని 2,443 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ ఆల్ఫాసైఫర్ మిథేన్ మందును కలిపిన మిశ్రమాన్ని స్ప్రేయింగ్ చేపట్టినట్టు చీఫ్ ఎంటమాలజి అధికారి తెలిపారు. వీటితో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని 1,361 పాఠశాలల్లో జిహెచ్ఎంసికి చెందిన వైద్యాధికారులు, ఎంటమాలజి అధికారులు దోమల నివారణపై విద్యార్థినీవిద్యార్థులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.