22 సంవత్సరాల బీజేపీ పాలనకు చెక్ పెట్టాలని భావించిన కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. గుజరాత్ ప్రజలు ఆరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టారు. అయితే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేయడంలో హార్ధిక్,జిగ్నేష్,అల్పేష్ ఠాకూర్ సక్సెస్ అయ్యారు.
వీరిలో దళిత హక్కుల కార్యకర్త, లాయర్ జిగ్నేష్ మేవాని(36),ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ ఎన్నికల బరిలో నిలిచారు. గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి జిగ్నేష్ 18,150 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.
రాదన్‌పూర్ నుంచి పోటీ చేసిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ నుంచి విజయఢంకా మోగించారు.గుజరాత్‌లోని అతి పెద్ద నియోజకవర్గాలలో రాదన్‌పూర్ కూడా ఒకటి. ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తైవాన్ నుంచి అతి ఖరీదైన పుట్టగొడుగులు తెప్పించుకుని తినడం వల్లే నల్లగా ఉండే ఆయన రంగు మారారని వ్యాఖ్యలు చేసి అల్పేష్ ఠాకూర్ వార్తల్లో నిలిచారు.
గుజరాత్‌లోని ఉనా జిల్లాలో దళితులపై దారుణాలపై జిగ్నేష్ అనేక ఆందోళనలు నిర్వహించారు. తన జాతి వారికి జీవించడానికి భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘ఆజాదీ కూచ్’ పేరుతో మేవాని చేపట్టిన ర్యాలీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నేపథ్యంలో జిగ్నేష్ కోసం సిట్టింగ్ స్ధానాన్ని స్థానాన్ని వదులకున్న కాంగ్రెస్ ఆ పార్టీ ఎమ్మెల్యే మనిభాయ్ వాఘేలాను బరిలో దించలేదు. కాంగ్రెస్‌తో పాటు ఆప్ కూడా బీగ్నేష్‌కి మద్దతు ప్రకటించింది.
పటేళ్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 25ఏళ్లు నిండి ఉండాలి. హార్థిక్ వయసు 24 సంవత్సరాలే కావడంతో ఆయన ఎన్నికల బరిలో నిలవలేదు.