సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం డిజే. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ముందుకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ వివాదంలో పడింది. కర్నాటకలో జరుగుతున్న ఈసినిమా షూటింగ్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తంమవుతున్నాయి. కర్నాటకలోని హసన్ జిల్లా బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో శివాలయం, శివలింగం సెట్లు వేసింది డీజే యూనిట్. ఇక్కడే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చెన్నకేశవ వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లు వేయటం.. భక్తలను కనీసం ఆలయంలోకి కూడా అనుమతించకపోవటంపై లోకల్ జనం, పూజారులు, భక్తులు నిరసనకు దిగారు. షూటింగ్ నిలిపివేయాలని గొడవకు దిగారు.
అయితే సినిమాకు సంబంధించి దేవాదాయశాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. రోజుకు లక్షన్నర రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని యూనిట్ సిబ్బంది చెబుతోంది. వైష్ణవ ఆలయంలో శైవచారానికి సంబంధించిన సెట్స్ వేయడం ఏంటని…దేవదాయ శాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందని అక్కడి పండితులు, భక్తులు మండిపడుతున్నారు.
మొత్తం మీద ఈ మధ్య కొన్ని సినిమాలు లేనిపోని కాంట్రవర్శీల్లో చిక్కుకుంటున్నాయి. సినిమా సెట్స్‌పై వెళ్లక, కొన్ని వెళ్లకముందే వివాదాలు మొదలైపోతున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా, ఓం నమో వేంకటేశాయ చిత్రాలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.