స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నారు. ఒక వైపున ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే, మరో వైపున అల్లుఅర్జున్ తదుపరి సినిమా మొదలుపెట్టేశాడు అల్లు అర్జున్.
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు ప్రారంభమైంది. నేడు ముహూర్తం సమయానికి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు, ఈ సినిమా యూనిట్ పూజాకార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సినిమా పేరు నా పేరు సూర్య గా ఖరారు చేశారు. దీనికి ఉప శీర్షికగా నా ఇల్లు ఇండియా అని పెట్టారు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ…. స్టైల్ సినిమా సమయంలో మా బ్యానర్లో సినిమా చేస్తా అని అల్లు అర్జున్ మాట ఇచ్చారు. ఆరోజు ఇచ్చిన మాటను గుర్తు పెట్టు కొని నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం మా బ్యానర్లో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డిజే ఆడియో కూడా అదిరిపోయింది. వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ కూడా గ్యారంటీ అని అర్థమవుతోంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ పడుతున్న వక్కంతం వంశీతో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
దర్శకుడిగా వక్కంతం వంశీ తొలి ప్రయత్నం ఎలా వుండబోతుందో అందరిలోను ఆసక్తి నెలకొంది.