టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులకు తెలియచేశారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. బన్నీ దంపతులకు తొలి సంతానంగా అబ్బాయి అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంతకు మించి ఏం ఆడగొద్దని… తమను అభినందించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
అల్లు అర్జున్, స్నేహ తమ పెద్దలను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2014లో ఈ దంపతులకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. ‘అయాన్’ అని పేరు పెట్టుకున్నారు. అయాన్ కు సంబంధించిన విషయాలను అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటాడు.
ఇక వరుస హిట్లతో దూసుకుపోతోన్న అల్లు అర్జున్ .. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో డిజే టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ – దిల్ రాజు కంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.