ఆర్కే…అలియాస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. నారా లోకేష్‌ని ఓడించడమే కాదు రైతు బిడ్డగా,మంగళగిరి అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తున్నారు ఆళ్ల. ఇక నియోజకవర్గంలోని పేదల ఆకలి తీర్చేందుకు రూ.5 కే భోజనాన్ని అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పటికీ ఓ సాధారణ రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ బాధ్యతల్ని చూసుకుంటూనే.. తన పొలంలో వ్యవసాయానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. తాజాగా మరోసారి హలం దున్నుతూ తన పొలాల్ని సాగు చేసుకుంటూ రైతుబిడ్డగా దర్శనమిచ్చారు.
అంతేగాదు తన ఇంటి ఆవరణలో ఉన్న గేదెల బాగోగులు కూడా ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. ఉదయం నిద్ర లేవగానే.. గేదెల దగ్గర పేడను తీసేసి.. గేదెల షెడ్డును ఆయనే శుభ్రం చేస్తున్నారు. వ్యవసాయం చేయడం మాత్రమే కాదు రాజన్న రైతు బజార్ పేరుతో తన పొలంలో పండిన కూరగాయల్ని తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారు ఆళ్ల. ఓ ఎమ్మెల్యే అయ్యుండి వ్యవసాయం చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.