రెండేళ్లకోసారి హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారీ ఏవియేషన్, ఏరోస్పేస్ షోకు సర్వం సిద్దమైంది. వింగ్స్ ఇండియా-2018 పేరుతో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ షోను కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇండియా-గ్లోబల్ ఎవియేషన్ హబ్ అనే థీమ్‌తో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భాగంగా పలు సదస్సులు, సిఇఒల రౌండ్ టేబుల్, టూరిజం, కార్గో, లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధిపై సమావేశాలు, జి2బి, బి2సి నెట్‌వర్కింగ్ ఉంటాయి. వింగ్స్ ఇండియా అవార్డుల ప్రదానం కూడా ఉంటుంది.
అమెరికా, జపాన్, యూకే, రష్యా, సింగపూర్ సహా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ ఏవియేషన్ షోలో బోయింగ్ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 737 మ్యాక్స్, 787 డ్రీమ్‌లైనర్, 777ఎక్స్ విమానాలను ప్రదర్శనకు తీసుకురానున్నట్లు బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేల్కర్ తెలిపారు.
దాదాపు 125 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఏటీఆర్, హోండా, ట్రూజెట్, గల్ఫ్‌స్ట్రీమ్, బోయింగ్, ఎంబ్రార్, డసాల్ట్ తదితర కంపెనీలు తమ విమానాలను ప్రదర్శనకు ఉంచుతాయి.విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలను అందించే కంపనీలు, ఎయిర్‌కార్గో, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ తదితర విభాగాలకు చెందిన కంపెనీలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి.