తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారన్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించాలన్నారు. అదేవిధంగా ప్రతి స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించాలన్నారు. సదస్సు నిర్వహణకు ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ఆహార, రవాణా తదితర కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై ఎస్వీబీసి వీడియో రూపొందించాలని ఆదేశించారు. సదస్సులో పాల్గొనే స్వామిజీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read:మూత్రవిసర్జనలో మంట వస్తోందా..!