గులాబీ జాతరకు కొంపల్లి ముస్తాభైంది. ఈ నెల 27 న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో నగరాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు. గులాబీ తొరణాలతో హైదరాబాద్ పింక్ సిటీగా మారిపోయింది. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీని, సెప్టెంబర్‌లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు.
ఇప్పటికే ప్లీనరీ విజయవంతానికి 9 కమిటీలను ఏర్పాటుచేయగా నగర అలంకరణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అప్పగించారు. ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేసీఆర్ కిట్‌లను తొరణాలుగా అలంకరించారు.
మహానగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు గులాబీ జెండాలతో నింపేశారు. నగరంలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులే దర్శనమిస్తున్నాయి.ప్లీనరీ వేదికపై పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్యనేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు కేసీఆర్ ఉపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది చొప్పున ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఇక కళాకారుల ఆటపాటల కోసం మరో వేదికను కేటాయించారు. వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధినాయకత్వం ప్లీనరీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిఏర్పాట్లు చేశారు.