నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. శాంతిభద్రతలను కట్టుదిట్టంగా అమలు చేయడానికి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా వేలాది మంది పోలీసులతో పాటు అదనపు బలగాలను మోహరించారు.
న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్‌ను ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గుంపులుగా రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు.
పబ్‌లు, క్లబ్‌లు, ఈవెంట్ నిర్వహించే ప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగనుంది. మహిళల భద్రతకు ప్రత్యేక షీ టీమ్స్‌ను రంగంలోకి దింపడంతో పాటు, నైట్ పెట్రోలింగ్‌ను పెంచారు.
ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో వాహనాలకు నో ఎంట్రీ విధించనున్నారు. పలుచోట్ల ఫ్లైఓవర్లను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు, భారీ వాహనాలపై రాత్రి వేళల్లో బ్యాన్ అమలు చేయనున్నారు. సురక్షితంగా, శాంతియుతంగా న్యూ ఇయర్‌ను జరుపుకోవాలని పోలీసులు నగరవాసులను కోరారు.
Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్!

