ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)తో పాటు మెట్రో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిగంటల్లో నగరంలో మెట్రో పరుగులు తీయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ..సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నాం 2.15 నిమిషాలకు మెట్రోను ప్రారంభించనున్నారు. అనంతరం మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు ప్రయాణించనున్నారు.
దీంతో పాటు ప్రపంచపారిశ్రామిక వేత్తల సదస్సుకు కనివిని ఎరుగని రితిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక,ప్రధాని మోడీతో పాటు ప్రపంచదేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో జీఈఎస్ జరగనుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు అవకాశం కల్పించడంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పించేలా సదస్సు జరగనుంది.
సదస్సులో పాల్గొనేందుకు ఇవాంక 28న తెల్లవారుజామున 3.30కి ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. ఆమె వెంట ప్రైవేట్ కమర్షియల్ ప్లైట్ లో వందమంది ప్రతినిధులు రానున్నారు. శంషాబాద్ నుంచి మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9.30కి హెచ్ఐసీసీలో ప్రతినిధులతో సమావేశం కానున్న ఇవాంక.. సాయంత్రం 4.30కి ప్రధాని మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు.
అనంతరం మోడీతో కలిసి సాయంత్రం 6.30కి ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్నర్ లో పాల్గొంటారు. డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి వెస్టిన్ హోటల్ కు వస్తారు. మరుసటి రోజు 29వ తేదీ ఉదయం 9.30కి హెచ్ఐసీసీ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం గోల్కొండను సందర్శించనున్న ఇవాంక.. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు వెస్టిన్ హోటల్ కు చేరుకుని .. రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్ లో అమెరికాకు తిరుగు పయనమవుతారు.