గంగ,జమున తెహజీబ్ సంస్కృతికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్‌లో బోనాల పండగ ప్రశాంతంగా జరిగేలా అందరు సహకరించాలని సూచించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌లో బోనాల పండగ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావొచ్చాయని తెలిపారు.
అమ్మవారి అనుగ్రహంతో తెలంగాణ సుభీక్షంగా ఉంటుందని ఇంద్రకరణ్ తెలిపారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. ఈ నెల 15న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జరిగేలా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జూలై 30న రంగం,ఏనుగు ఊరేగింపు ఉంటుందన్నారు.