అదరగొట్టిన సన్ రైజర్స్

210
All-round SRH romp to thumping win
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు దుమ్ము లేపారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 208 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 181 పరుగులకే పరిమితమైంది. మార్ష్‌ మినహా పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భువనేశ్వర్‌ (2/23) ఎప్పట్లాగే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

న్యూజిలాండ్‌ విధ్వంసక ఓపెనర్‌ గప్తిల్‌ (23)ను ఔట్‌ చేసి పంజాబ్‌ను తొలి దెబ్బ తీశాడు భువి. గప్తిల్‌తో పాటు వోహ్రా (3), మాక్స్‌వెల్‌ (0) కూడా త్వరగా ఔటవడంతో పంజాబ్‌ 5 ఓవర్లకు 42/3తో నిలిచింది. ఈ దశలో మోర్గాన్‌ (26)తో కలిసి మార్ష్‌ పోరాడటంతో కింగ్స్‌ జట్టులో ఆశలు మొలకెత్తాయి. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ అంతకంతకూ పెరిగిపోవడం, జోరందుకుంటున్న సమయంలో మోర్గాన్‌ (26)ను రషీద్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. కాసేపటికే మార్ష్‌ కూడా ఔటవడంతో పంజాబ్‌ కథ ముగిసింది.

అంతకముందు టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌… హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శిఖర్ ధావన్ (77), డేవిడ్ వార్నర్ (51), కేన్ విలియమ్సన్ (54 నాటౌట్) పరుగుల వర్షం కురిపించారు. దీంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టగా.. పవర్ ప్లేలోనే వార్నర్ కూడా టాప్ గేర్ వేయడంతో స్కోరుబోర్డు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. బౌలర్ ఎవరనేదానితో సంబంధం లేకుండా వరుసగా బౌండరీలు బాదిన ఈ జోడి తొలి వికెట్‌కి 10 ఓవర్లలో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. యువరాజ్ సింగ్ (15) నిరాశపరిచాడు. చివర్లో విలియమ్సన్ స్వేచ్ఛగా హిట్టింగ్ చేసేయడంతో హైదరాబాద్ టోర్నీలో రెండోసారి 200పైచిలుకు స్కోరు అందుకోగలిగింది.

- Advertisement -