ఆరోగ్య భాదలు లేని గ్రామంగా చింతమడక:సీఎం కేసీఆర్‌

414
cm kcr chinthamadaka
- Advertisement -

ఇవాళ నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజన్నారు సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో పర్యటించిన సీఎం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. చింతమడక గ్రామంపై వరాల జల్లు కురిపించారు. చింతమడక వాస్తు అద్భుతంగా ఉందన్నారు. నా అదృష్టం బాగుండి ఈ గ్రామంలో జన్మించానని తెలిపారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు సీఎం కేసీఆర్‌. దమ్మచెరువు మీద నుంచి కాళేశ్వరం కాలువ వస్తుందన్నారు. ఎలాంటి చింత లేకుండా కాళేశ్వరంతో ప్రజలు బ్రతికే రోజు వస్తుందన్నారు.

చింతమడక బిడ్డ ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారని తెలిపారు. కరెంట్ బాధలు,మంచినీళ్ల కష్టాలు తీర్చామన్నారు. చింతమడకలో స్కూల్ లేకపోవడంతో గూడురులో చదువుకున్నానని తెలిపారు. చింతమడక అభివృద్ధి చెందాలన్నారు. చింతమడకను అభివృద్ధి చేసే బాధ్యత కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అప్పచెబుతున్నానని చెప్పారు.

చింతమడకలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. చింతమడక ఆరోగ్య బాధలు లేని గ్రామంగా తయారుకావాలన్నారు. యావత్ తెలంగాణలో ఆరోగ్య సూచిక ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్‌కు నాంది చింతమడక కావాలన్నారు. ఉప్పలవని కుంట్ల,దమ్మచెరువు,మాచాపురం,సీతారాంపల్లి,అంకంపేట,మాచాపూర్‌ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

చింతమడకలో 904 కుటుంబాలున్నాయని చెప్పారు. వలస వెళ్లిన వారిని వెనక్కిరప్పించి అభివృద్ది చెందేలా చూడాలన్నారు. ప్రతీ ఇంటికి 10 లక్షలు లాభం చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన 200 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు.

చింతమడక రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. హరీష్ కోరిన విధంగా సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నానని తెలిపారు. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక్క విమానం తప్ప సిద్దిపేటలో అన్ని ఉన్నాయని చెప్పారు కేసీఆర్.

చింతమడకలో ప్రతి ఇంట్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఉండాలన్నారు. మహిళా,యువకుల సంఘాలు ఏర్పాటుచేయాలని సూచించారు. గ్రామం అభివృద్ధి కోసం ఏం చేయాలనే దానిపై చర్చించాలన్నారు. చింతమడకకు 1500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మాచాపూర్,సీతారాంపల్లి గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు.

- Advertisement -