పాత్రికేయులను అన్ని విధాల అదుకుంటాం….

242
- Advertisement -

ప్రగతిభవన్‌లో జనహిత కార్యక్రమంలో భాగంగా దివంగత జర్నలిస్టుల కుటుంబాలతో సీఎం కేసీఆర్ సమావేశమైయ్యారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం పరిష్కరిస్తదని పునరుద్ఘాటించారు. సీనియర్ జర్నలిస్ట్ హరికిషన్‌రెడ్డి గుండె మార్పిడి కోసం రూ.10లక్షలు మంజూరు చేసినమని సీఎం తెలిపారు.

ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన జనహిత కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్టు జే. శ్రీ‌నివాసులు కుటుంబానికి  సీఎం కేసీఆర్ నాలుగు ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీనివాసులు స‌తీమ‌ణి అన్న‌పూర్ణకు నాలుగులక్షల చెక్‌ను సీఎం అంద‌జేశారు. జే.శ్రీనివాసులు దాదాపు 30 ఏళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించారు.కాగ శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో చ‌నిపోయిన 69 మంది జ‌ర్న‌లిస్టుల‌కు ఇవాళ చెక్‌ల‌ను అంద‌జేశారు.

చనిపోయిన జర్నలిస్టులకు పెళ్లీడు అమ్మాయిలుంటే రూ.3లక్షలు రిలీఫ్ ఫండ్ నుంచి అందిస్తమని సీఎంకేసీఆర్‌ స్పష్టం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తమని సీఎం వెల్లడించారు. పాత్రికేయుల కృషికి వచ్చే బడ్జెట్‌లో 30కోట్లు ప్రకటిస్తామని కేసీఆర్‌ ఈసందర్భంగా అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ అల్లంనారాయణతో కలిసి పనిచేసిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇంతమంచి కార్యక్రమం చేపట్టినందుకు సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్థిక సాయం చేయ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ముందు ఉన్న‌ద‌ని ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ అన్నారు.  ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయినినర్సింహారెడ్డితోపాటు పలువురు అధికారులు, సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -