సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే హరీష్ రావు…జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ సభా సమావేశ స్థలం, సహపంక్తి భోజనాల ఏర్పాటు, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల గుర్తింపు చేసినట్లు తెలిపారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వం సిద్ధం చేశామన్నారు హరీష్ రావు.
చింతమడక గ్రామంలో కుటుంబాల వారీగా సమగ్ర సమాచార సేకరణ పూర్తయిందన్నారు. గ్రామంలో 596 ఇండ్లు, 874 కుటుంబాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతుల గుర్తింపు, భూమిలేని వారి వివరాలు, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ప్లాంటేషన్, శానిటేషన్, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టామన్నారు.
రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటామన్నారు. కొత్త రహదారుల నిర్మాణంకు సంబంధించి అంచనాలు తయారయ్యాయన్నారు. గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న మురికి కాల్వ నిర్మాణం పూర్తి కావొచ్చిందని పేర్కొన్నారు. గ్రామంలో ఆలయాలకు రంగులు, మిగతా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.