తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇప్పటికే రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారికి ఫీజు తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది.
పాస్ అయిన జవాబు పత్రాల రి వెరిఫికేషన్ కోసం మాత్రమే దరఖాస్తు ఫీజును యధావిధిగా చెల్లించాలని..సప్లిమెంటరి పరీక్ష ఫీజును చెల్లించేవాళ్లు యధావిధిగా వారి కళాశాలల్లో చెల్లించాలని తెలిపింది.
రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఇంటర్ నెట్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మే 15 లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కులను విద్యార్థుల ఇంటికి పంపుతామని తెలిపింది.
ఇక ఇప్పటికే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తప్పు ఎక్కడ దొర్లిందో తెలుసుకోవాలని సూచించిన సీఎం ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.