ఫ్రైడే ఫైట్…గెలుపెవరిది..!

211
modi
- Advertisement -

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇవాళ చర్చకు రానుంది. వాజ్‌పేయ్‌ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న మోడీ….విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చేలా కసరత్తు చేశారు. ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. సాయంత్రం 6గంటల వరకు చర్చజరగనుంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభ్యుల ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వనున్నారు.

అనంతరం ప్రధాని సమాధానంపై సభ్యుల వివరణ అనంతరం ఓటింగ్ జరగనుంది. స్పీకర్‌ని మినహాయిస్తే 533 మంది సభ్యులుండగా అవిశ్వాసం నెగ్గాలంటే అధికారపార్టీకి 267 మంది మద్దతు లభిస్తే పైచేయి సాధించినట్టే. బీజేపీకి సొంతంగానే 273 మంది సభ్యులుండగా మిత్రపక్షాలతో కలిపి 316 సభ్యుల బలం ఉంది. దీంతో అవిశ్వాస తీర్మానంలో బీజేపీ నెగ్గడం నల్లేరుమీద
నడకే కానుంది.

చర్చలో బీజేపీ 3 గంటల 38 నిమిషాలు,కాంగ్రెస్ 38 నిమిషాలు,అన్నాడీఎంకే సభ్యులు 29 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. తృణముల్ కాంగ్రెస్ సభ్యులు 27 నిమిషాలు,అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీకి 15 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. టీఆర్ఎస్‌కు 9 నిమిషాలు,సీపీఎంకు 7 నిమిషాలు,ఎస్పీకి చెందిన సభ్యులు 6 నిమిషాల పాటు చర్చలో పాల్గొని మాట్లాడనున్నారు.

ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా గల్లా జయదేవ్ చర్చలో మాట్లాడనున్నారు. రెండో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు మాట్లాడనున్నారు. ఇంకా సమయం ఉంటే తొట నరసింహం మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు 15 నిమిషాలపాటు మాట్లాడనున్నారు. మంత్రులు సుష్మాస్వరాజ్‌, నిర్మలాసీతారామన్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, రవిశంకర్‌ప్రసాద్‌, నితిన్‌గడ్కరీ, పీయూష్‌గోయల్‌లు వివిధ అంశాల్లో జోక్యం చేసుకొని మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ చర్చలో పాల్గొనున్నట్లు సమాచారం. ఓవరాల్‌గా అవిశ్వాసం చర్చ సందర్భంగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఫ్రైడే ఫైట్‌లో గెలుపెవరిదైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధికార,ప్రతిపక్ష పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

- Advertisement -