సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో ఈనెల 21న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ గోదాముల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతారు. ఈ రోజు మధ్యాహ్నం లోగా ఉప ఎన్నిక తుది ఫలితం వెలువడనుంది. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ లు గెలుపుపై ధీమాతో ఉన్నారు. సర్వేలన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని తెలిపాయి. టీర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య , మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోటీలో ఉన్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.