వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతుతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేస్తామన్నారు. తిరుమలలోని క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తాం అన్నారు.
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు అన్నారు. డిసెంబరు 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టోకెన్లు రద్దు చేశామన్నారు. దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారన్నారు.
Also Read:బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం