అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : మంత్రి హ‌రీశ్‌రావు

91
harish
- Advertisement -

ఆరు రోజుల‌ నుంచి తెలంగాణలో కురుస్తున్న భారీ వ‌ర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని అధికారుల్ని అప్ర‌మ‌త్తం చేసిన హ‌రీశ్‌రావు పలు సచనలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కేంద్రాల్లోనే ఉండి ఎప్ప‌టిక‌ప్పుడు పరిస్థితులను సమీక్షించాలన్నారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయ‌ని, రోడ్లు, ఇండ్లు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు. దూప్‌సింగ్ తండాలో రోడ్లు దెబ్బతిని రాక‌పోక‌లు బంద్ అయ్యాయ‌న్నారు. తండా వాసులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దూప్ సింగ్ తండాకు వెళ్ళే బ్రిడ్జిని 3 కోట్ల తో నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామినిచ్చారు. వెంటనే గ్రామస్థులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నర్సాపూర్ లో కోర్టు భవనం కూలిపోయింద‌ని, దానికి సీడీపీఓ భవనాన్ని తాత్కాలికంగా కేటాయించిన‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు వివ‌రించారు. జిల్లాల్లో 370 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయ‌ని, ఒక్కొక్కరికీ రూ. 3,200 పరిహారం చెల్లిస్తామ‌ని చెప్పారు. జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండాయ‌ని, పోచారం ప్రాజెక్టు, చెరువులోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులను అప్ర‌మ‌త్తం చేశామ‌ని తెలిపారు. ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, పాత ఇళ్లలో ఉన్న వారిని క్షేమంగా ఇత‌ర ప్రాంతాల‌కు తరలించాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో రైతు బంధు ద్వారా రూ. 7,521.8 కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. వానాకాలానికి సంబంధించి నీటి సరఫరా నిర్ణయం తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. పంచాయితీ రోడ్ల మరమ్మతుల కోసం రూ. 85 కోట్ల‌ ప్రత్యేక నిధులు కేటాయించామ‌న్నారు. జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై స‌మీక్షించామ‌ని, త్వరలో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. రూ. 6 కోట్ల‌తో డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామ‌ని చెప్పారు. ఆగస్టు 7న మెదక్ నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. ఆగస్టు రెండో వారంలో తూఫ్రాన్‌, వెల్దుర్తిల్లో ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఆరునెలల్లో రైల్వేలైన్ కోసం రాష్ట్ర సర్కారు రూ. 50 కోట్లు కేటాయించింద‌న్నారు. త్వ‌రలోనే ఎరువుల కోసం మెదక్‌లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

బీజేపీ స‌ర్కారు స‌హ‌క‌రించ‌కున్నా రాష్ట్ర రైతాంగాన్నిటీఆర్ఎస్ స‌ర్కారు కంటి పాపల కాపాడుకుంటుంద‌ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రైతుల‌పై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వివ‌క్ష చూపుతున్న‌ద‌ని మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడినా ప్రతి గింజనూ కొన్నామ‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు. బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చార‌ని, నూక‌ల న‌ష్టాన్ని తామే భ‌రిస్తామ‌ని చెప్పినా ఇప్పుడు బియ్యం ఎందుకు తీసుకోవడం లేద‌ని ప్ర‌శ్నించారు. బియ్యం ఎందుకు కొంట‌లేరో టీబీజేపీ నాయ‌కులు తెలంగాణ రైతుల‌కు చెప్పాల‌న్నారు.

- Advertisement -