ముగిసిన ఖమేనీ అంత్యక్రియలు

0
- Advertisement -

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్‌లోని పవిత్ర ఇమామ్ రెజా క్షేత్రంలో ముగిశాయి. ఆయనకు చివరి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు, శోకసంద్రంలో ఉన్న ప్రజలు ఇక్కడకు తరలివచ్చినట్లు ప్రభుత్వ ఆధీనంలోని ప్రెస్ టీవీ నివేదించింది.

సంప్రదాయ ఇస్లామిక్ అంత్యక్రియల ఆచారాలలో భాగంగా ఖమేనీ శవపేటికను ఇమామ్ రెజా సమాధి చుట్టూ తిప్పిన తర్వాత, దార్ అల్-ధికర్ ప్రార్థనా మందిరంలో ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఖమేనీ పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ ఈ అంత్యక్రియల ప్రత్యేక ప్రార్థనలను పర్యవేక్షించారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) ప్రకారం..దనేష్ కూడలి నుండి ఇమామ్ రెజా క్షేత్రం వరకు ప్రజలు విపరీతంగా పోటెత్తడంతో రోడ్డు మార్గంలో వెళ్లడం అసాధ్యంగా మారింది. దీనితో అధికారులు ఖమేనీ భౌతిక కాయాన్ని హెలికాప్టర్ ద్వారా పవిత్ర క్షేత్రానికి తరలించాల్సి వచ్చింది.

అంత్యక్రియల మార్గంలో కిక్కిరిసిన ప్రజలు, ఖమేనీ భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను చుట్టుముట్టిన విజువల్స్‌ను ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. ఈ ఊరేగింపులో ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బ్యానర్లు ప్రదర్శించారు. ఖమేనీ మరణానికి అమెరికానే పూర్తి బాధ్యత వహించాలని టెహ్రాన్ భావిస్తోంది. ఇదిలావుండగా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మరో కుమారుడు మోజ్తబా ఖమేనీ ఈ బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also Read:కేసీఆర్‌ని కలిసిన రవిచంద్ర

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమ ఆసియా ప్రాంతంలో తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఆయన మరణం తర్వాత, కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమితులయ్యారు.

- Advertisement -